అమెరికాలోని మిసిసిపి డెల్టాకు ‘టోర్నడో’ ఎమర్జెన్సీ
అమెరికాలో వరుస తుపాన్, టోర్నడోలతో మిసిసిపి డెల్లా అల్లకల్లోలమవుతోంది. దీనితో ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అమెరికా ఆధ్యక్షుడు జోబైడన్. శుక్రవారం తీవ్రగాలులు, భారీ వర్షంతో కరోల్, మన్రో, షార్కీ కౌంటీ వంటి ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ఇక్కడ తుపాన్ ప్రభావంతో విపరీత నష్టం జరిగింది. టోర్నడోల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరణాలు 30కి చేరుకున్నాయి. ఇళ్లు కోల్పోయిన అభాగ్యులు వందల సంఖ్యలో ఉన్నారు. దీనితో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. టోర్నడో, తుపాన్ బాధితులకు ఇళ్ల మరమ్మత్తులు, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తామని సమాఖ్య నిధులను విడుదల చేస్తామని, వైట్ హౌస్ నుండి ప్రకటన వెలువడింది.

టోర్నడోలు గంటకు 265 నుండి 320 కిలోమీటర్ల వేగంతో విరుచుకు పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకా ప్రమాదం తొలగిపోలేదని తీవ్రగాలులు, వడగళ్లతో తుపాన్ రావచ్చని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుపాన్ ఉద్ధృతికి రోలింగ్ ఫోర్క్ పట్టణంలోని ఇళ్లన్నీ కొట్టుకొని పోయి, కార్లు తలకిందులయ్యాయని, దశాబ్దాల కిందటి చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. మిసిసిపీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.