Home Page SliderInternationalNewsPolitics

నాసా చీఫ్‌గా ఎలాన్ మస్క్ ఫ్రెండ్…

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి చీఫ్‌గా ఎలాన్ మస్క్ బిజినెస్ ఫ్రెండ్ జేర్డ్ ఐజాక్‌మెన్ ఎంపికయ్యారు. బిలియనీర్ వ్యాపారవేత్త, పైలట్, ప్రైవేట్ వ్యోమగామి కూడా అయిన జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అడ్మినిస్ట్రేటర్‌గా ఎంపిక చేసినట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన నాయకత్వంలో నాసా మిషన్ మరింత పురోగతి సాధిస్తుందని, స్పేస్ సైన్స్, టెక్నాలజీలో లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

ఐజాక్‌మెన్ ప్రస్తుతం షిఫ్ట్ 4 పేమెంట్స్ అనే కంపెనీ సీఈవోగా ఉన్నారు. ఆయన తన 16వ ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్‌ఎక్స్ సంస్థ పొలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్-9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములలో ఒకరిగా ఐజాక్‌మెన్ కూడా ప్రయాణించారు. అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.