ఏనుగుల బీభత్సం..ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
కేరళలోని ఒక ఆలయంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బాణాసంచా పేలుడు వల్ల బెదిరిపోయి భక్తులను తొక్కుకుంటూ పరుగులు తీయడంతో ముగ్గురు భక్తులు మరణించగా, దాదాపు 25 మంది గాయపడినట్లు సమాచారం. కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి వద్ద కురవంగడ్ అనే గ్రామంలో మనక్కులంగర భగవతి ఆలయం వద్ద వార్షిక ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో చివరి రోజున గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిర్వాహకులు రెండు ఏనుగులను తీసుకువచ్చారు. ఏనుగులను ఊరేగింపు చేస్తుండగా, టపాసులు కాల్చారు. ఈ శబ్దానికి బెదిరిపోయిన ఒక ఏనుగు మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. దీనితో రెండు ఏనుగులు భక్తుల వైపు దూసుకురావడంతో వారు తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. ఏనుగుల తోపులాటలో ఉత్సవానికి ఏర్పాటు చేసిన మండపాలు కూడా కూలిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు ఏనుగులను అదుపు చేసి తీసుకెళ్లారు.