ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, బైక్లను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నాయి. అంతమాత్రమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళేలా చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఇంధన ఖర్చులు తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాలుష్యం నుంచి కాపాడతాయి. దీంతో ప్రపంచంలోని ఎన్నో దేశాలు వీటిని విరివిగా వినియోగిస్తున్నాయి.

భారతదేశం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతుంది. ఈ మేరకు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కేంద్రమంత్రి నితీశ్ గడ్కరీ చేతుల మీదుగా ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ దేశంలోనే తొలిసారిగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొత్తం 900 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని బీఎంసీ నిర్ణయించింది. అయితే స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును దక్కించుకోగా..వచ్చే ఏడాది మార్చిలోగా 450 బస్సులను అందజేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి.