Home Page SliderNational

హర్యానాలో ఎన్నికల జోరు.. 20 గ్యారంటీలతో బీజేపీ

హర్యానాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎలాగైనా గెలవాలని 20 గ్యారంటీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలు కుప్పించింది. మాజీ అగ్నివీరులకు శాశ్వత ఉద్యోగాలిస్తామంటూ హామీలిస్తున్నారు. ఈ మేనిఫెస్టోను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. దీనికి ‘సంకల్ప్ పత్ర్’ అని పేరు పెట్టారు. మహిళలకు ‘లాడో లక్ష్మీ యోజన’ పథకం కింద ప్రతీ నెలా రూ.2,100 ఇస్తామని పేర్కొన్నారు. హర్యానాలో 10 పారిశ్రామిక నగరాల నిర్మాణం, నగరానికి 50 ఉద్యోగాలు కల్పిస్తామని, స్థానికులకే ప్రాధాన్యం అని హామీ ఇస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధరలతో 24 రకాల పంటలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షలమందికి ఉపాధి అవకాశాలు హామీ ఇచ్చారు. ‘చిరయు ఆయుష్మాన్ యోజన’ పేరుతో కుటుంబానికి రూ. 10 లక్షలు ఆరోగ్యబీమా కల్పిస్తారు. ఇంకా ‘అవల్ బాలికా యోజన’, ‘గృహిణి యోజన’ కింద రూ.500లకే ఎల్‌పీజీ సిలెండర్లు వంటి మొత్తం 20 హామీలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి.