రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ…కవిత
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దుమ్మెత్తి పోశారు. ఎలక్షన్ గాంధి అనే పేరు రాహుల్కు బాగా సూటవుతుందని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో తెలంగాణ కష్టపడి తనకు తానుగా అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ కానీ ఏ రకమైన సహాయం అందించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీల మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో తెలంగాణాను ఎన్నో మాటలు అన్నారని, సోనియా గానీ, రాహుల్ గానీ పల్లెత్తు మాట అనలేదని, ఖండించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బుద్దులు ఎవరికి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలంటే మత కల్లోలాలు సృష్టించేవారన్నారు. ఈ సంగతి రాహుల్కు తెలియదా అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లలో మత ఘర్షణలకు తావు లేదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు, విదేశీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలతో కళకళలాడుతోందన్నారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లుగా తెలంగాణాను అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణకు నీళ్లు గానీ, కరెంటు గానీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాహుల్ తెలంగాణకు ప్రచారానికి వస్తే స్వాగతిస్తాం, కానీ ఇక్కడ చక్కటి వాతావరణాన్ని చెడగొట్టవద్దని హెచ్చరించారు.

