విద్య, వైద్యం మా ప్రభుత్వ ఎజెండా..
పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం మంత్రిని సూచించారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభ, హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

