మళ్లీ ఈడీ దాడులు.. మంత్రి గంగుల ఇంట్లోనూ సోదాలు
మునుగోడు ఉప ఎన్నిక పూర్తయింది.. తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈడీ, ఐటీకి చెందిన 30 బృందాలు 10 వాహనాల్లో బుధవారం తెల్లవారుజూమునే తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, అత్తాపూర్, కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన గ్రానైట్ వ్యాపారులు పన్ను ఎగవేశారనే ఆరోపణలు రావడంతో వాళ్ల అక్రమ ఆదాయంపై నిఘా పెట్టారు. తనిఖీ చేస్తున్న అధికారుల్లో మహిళలు కూడా ఉన్నారు.

అప్రూవర్‌గా ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడు..
కరీంనగర్‌లోని మంకమ్మ తోటలో గల శ్వేతా గ్రానైట్స్, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. శ్వేతా గ్రానైట్ కంపెనీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందినది కావడంతో మంత్రి ఇంటి వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ సోదాలు మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అప్రూవర్‌గా మారాడు. అతను ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

