Home Page SliderTelangana

16న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. మళ్లీ మార్చి 16న హాజరవ్వాలని ఈడీ సమన్లిచ్చింది. ఇదే కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ కొత్త మద్యం పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో కీలక దృష్టి కేంద్ర ఏజెన్సీలు “సౌత్ గ్రూప్”గా పిలిచే మధ్యవర్తులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల నెట్‌వర్క్‌పై ఫోకస్ పెంచారు.

“సౌత్ గ్రూప్”కి చెందిన కంపెనీలకు సహాయం చేయడానికి మద్యం పాలసీని రూపొందించారని, తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధిపొందిందని… ED ఆరోపించింది. సిసోడియా ఎటువంటి సంప్రదింపులు లేకుండా పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మలుచుకున్నారంది. రాడార్ కింద ఉన్న “సౌత్ గ్రూప్” వ్యక్తులలో ముఖ్యులు కవిత అంటూ ఈడీ పేర్కొంటోంది. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ఏజెన్సీలను బీజేపీ ఉపయోగించుకుంటోందని.. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కవితకు ఇస్తున్నవి ఈడీ సమన్లు కాదని మోడీ సమన్లంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముందు ఈడీ ఆ తర్వాత మోడీ రావడం సహజంగా జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ప్రజా కోర్టులో బీజేపీ సంగతి తేల్చుతామంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.