NationalNews

క్యాసినో కేసులో 100 మందికి ఈడీ నోటీసులు

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఉచ్చు మరింత బిగించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ఈడీ ఏకంగా 100 మందికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులైన మహేష్‌, ధర్మేంద్ర యాదవ్‌లను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డిలను ఈడీ అధికారులు నేడు, రేపు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈడీ నోటీసులు అందుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి గురువారం విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట యుగేందర్‌ అనే వ్యక్తి కూడా విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడే యుగేందర్‌ అని తెలుస్తోంది.

తలసాని సోదరులు వ్యాపారాల రికార్డులు సమర్పించాలి..

మరోవైపు క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్‌ను నాలుగు రోజుల పాటు విచారించగా.. మంత్రి తలసాని సోదరులతో సహా పలువురితో జరిపిన లావాదేవీలపై కీలక సమాచారం ఇచ్చినట్లు సమాచారం. తలసాని సోదరులు మహేష్‌, ధర్మేంద్రకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం ఎవరికీ తెలియదు. వారు ఈడీ కార్యాలయానికి రావడంతో విషయం బయటపడింది. వీరి వ్యాపారాలకు సంబంధించి నాలుగేళ్ల రికార్డులు సమర్పించాలని తలసాని సోదరులను ఈడీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారాల్లో మంత్రి తలసాని పార్టనర్‌గా ఉన్నారో.. లేదో తెలియదు.