కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు..బీజేపీ ఎంపీ
కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదని, కేసీఆర్ అరెస్టు కాక తప్పదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన ప్రతీ అవినీతిలోనూ, స్కాంలలోనూ, ఫోన్ ట్యాపింగుల వ్యవహారాలలోనూ అధికారులంతా కేసీఆర్ పేరే చెప్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల స్కాం విషయంలో గతంలోనూ రఘునందన్ రావు కేసీఆర్ ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఇప్పటికే ఈడీ అధికారులు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఈ స్కాంలో కేసీఆర్ ప్రమేయం లేకుండా ఉండదని ఆయన ఆరోపిస్తున్నారు. గొర్రెల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని, లబ్దిదారులకు కాకుండా ఇతరులకు ప్రయోజనాలు చేకూరాయని ఇప్పటికే ఈ కేసులో కొందరు అధికారులను అరెస్టు చేశారు. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది.