వాషింగ్ మెషీన్‌లో రెండున్నర కోట్లు… ఈడీ రెయిడ్స్‌లో విడ్డూరం! డబ్బును క్లీన్ చేస్తున్నారా ఏంటి?
వాషింగ్ మిషన్లో రెండున్నర కోట్లు కనుగొన్న ఈడీ
ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, కురుక్షేత్రలో సోదాలు
విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించిన కేసులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాషింగ్ మెషీన్‌లో దాచిన రెండున్నర కోట్ల రూపాయలను కనుగొంది. ఢిల్లీతోసహా, వివిధ నగరాల్లో సోదాల సందర్భంగా లెక్కాపత్రాలు లేని రూ. 2.54 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ వంటి పలు కంపెనీల డైరెక్టర్ల ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ఈ కంపెనీల భాగస్వాములైన విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్గ్ మరియు వినోద్ కేడియా తదితరులను ఈడీ విచారిస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా మరియు హర్యానాలోని కురుక్షేత్రలోని వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అయితే వాషింగ్ మెషీన్‌లో ఉంచిన నగదు ఎలా బయటపడిందన్నది ఈడీ వెల్లడించలేదు.

ఇండియా బయట దేశాలకు విదేశీ మారకద్రవ్యాన్ని “పెద్ద స్థాయిలో” పంపడంలో కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయన్న “విశ్వసనీయ సమాచారం” ఆధారంగా ఈ చర్య చేపట్టినట్టు ఈడీ పేర్కొంది. సింగపూర్ గెలాక్సీ షిప్పింగ్, లాజిస్టిక్స్, హారిజోన్ షిప్పింగ్, లాజిస్టిక్స్‌లకు ₹ 1,800 కోట్ల “అనుమానాస్పద” చెల్లింపులు చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ రెండు విదేశీ సంస్థలు ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీటన్ మారిటైమ్, కంపెనీలు బూటకపు సరుకు రవాణా సేవలు, దిగుమతుల ముసుగులో సింగపూర్‌కు చెందిన సంస్థలకు ₹ 1,800 కోట్ల మేర చెల్లింపులు చేశాయి. నేహా మెటల్స్, అమిత్ స్టీల్ ట్రేడర్స్, ట్రిపుల్ ఎమ్ మెటల్, అల్లాయ్స్, హెచ్‌ఎంఎస్ మెటల్స్ వంటి షెల్ కంపెనీల సహాయంతో ఈ లావాదేవీలు జరిగాయి. సోదాలో, వాషింగ్ మెషీన్‌లో దాచిన ₹ 2.54 కోట్ల విలువైన నగదు కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కీలక పాత్రలతోపాటుగా, డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 47 బ్యాంకు ఖాతాలు కూడా స్తంభింపజేశారు.

