రెండు తేదీలలో దసరా పండుగ కన్ఫ్యూజన్
గతంలో పండుగ అంటే సరదాగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియో ప్రపంచంలో ప్రతీ దానికి కన్ఫ్యూజనే. ఇప్పుడు దసరా పండుగ రెండు తేదీలతో తికమక పెడుతోంది. విజయదశమి వేడుకను ఎప్పుడు జరుపుకోవాలా అని ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఈనెల 23నా లేక 24 అనేది పండితులను అడిగితే మరింత మీమాంస పెరిగిపోతోంది. దీనితో ఏం చేయాలో అర్థం కావట్లేదు. శృంగేరి మఠం 23ను దసరా జరుపుకోవాలని ప్రకటించింది. దశమి 23నే వచ్చిందని కొందరు, 24 సూర్యోదయకాలంలో దశమి ఉందని కొందరు వాదిస్తున్నారు. దీనితో దశమి కన్ఫ్యూజన్ మొదలయ్యింది. గతంలో రాఖీ పండుగ, తర్వాత వినాయక చవితి విషయంలో కూడా ఈ తిథుల విషయంలో తికమక వచ్చింది.

తొమ్మిది రోజులపాటు భీకర యుద్ధం చేసి, మహిషాసుర మర్థనిగా దుష్టుడైన మహిషాసురుని సంహరించి అమ్మవారు శాంతిని నెలకొల్పిన దినాన్నే విజయదశమి జరుపుకుంటాము. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా జరుపుకుంటారు. రోజుకో అలంకారంతో భక్తులకు కనువిందు చేస్తుంది అమ్మవారు. తెలంగాణలో బతుకమ్మ పేరుతో వైభవంగా జరుగుతుంది దసరా నవరాత్రులు. కర్ణాటకలోని మైసూర్‌లో చాముండేశ్వరి గుడిలో మైసూర్ మహరాజులు అత్యంత వైభవంగా దసరాను నిర్వహించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇక కలకత్తాలో నవరాత్రులు చూడడానికి రెండుకళ్లూ చాలవు. గుజరాత్‌లోని ఆడపడుచులు గర్భా నృత్యాలు చేసి, నవరాత్రి దినోత్సవాలను సందడిగా చేసుకుంటారు. ఇలా దేశమంతా జరుపుకునే పెద్ద పండుగ ఈ దసరా. దీనిని సంతోషంతో, అనుమానాలు లేకుండా జరుపుకోవాలి.