దసరా ఉత్సవాలు..మహాచండీగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం ఐదవరోజు శ్రీ మహాచండీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిలో శ్రీమహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి కలిసిన త్రిశక్తి స్వరూపిణి ఉందని భక్తుల నమ్మకం. చండీమాత అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రుభయం తొలగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తారు. నవరాత్రులు మొదలైన దగ్గర నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి మూడు రోజులలోనే రెండులక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అసౌకర్యానికి లోనవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.