NewsTelangana

హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

హాస్టల్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. అతని తల్లితండ్రులు విద్యార్థి మృతదేహంతో హస్టల్ ముందు ఆందోళనకు దిగారు.  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఏళ్ళూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆలం రాజేష్ మృతి చెందారు. రాజేష్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యమే స్టూడెంట్ ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి బయట స్టూడెంట్ మృతదేహంతో కూర్చొని ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై తెలంగాణ రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.

విద్యార్థి పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు హాస్టల్ నుంచి తీసుకెళ్లారు. తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం ప్రిన్సిపాల్‌, వైద్య సిబ్బంది విద్యార్థి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఐటీడీఏ ద్వారా వైద్య ఖర్చులు అందించడమే కాకుండా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నందుకు రెండు యూనిట్ల రక్తాన్ని అందించారు. హిమోగ్లోబిన్‌, ఆక్సిజన్‌ ​​లెవల్స్‌ తక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విద్యార్థి మృతి చెందాడు. ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. జ్వరం వస్తే విద్యార్థులకు తగిన వైద్యం అందించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. వర్షాకాలంలో విద్యార్థులకు అందించే ఆహారం, నీటితో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.