‘ చాట్‌జీపీటీని ఎక్కువగా నమ్మొద్దు’… సృష్టికర్త
ఓపెన్ ఏఐ కొత్తగా నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో శామ్ ఆల్ట్‌మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ చాట్‌బాట్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏఐ ఎలాంటి మాయ అయినా చేస్తుంది. అందుకే చాట్‌జీపీటీపై ప్రజలు విపరీతమైన విశ్వాసం చూపిస్తున్నారు. ఇది ఆసక్తికర విషయమే అయినా.. దీన్ని మీరు అంతగా నమ్మకూడదు. కృత్రిమ మేధ రంగంలో చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లు యూజర్ల అవసరాలను తీర్చేందుకు కొన్ని సార్లు వాస్తవాలతో రాజీపడి కల్పిత సమాచారాన్ని సృష్టిస్తుంటాయి. అసలు ఉనికిలోని లేని అంశానికి కూడా చక్కగా తప్పుడు సమాచారం ఇస్తుంటాయి’’ అని ఆల్ట్‌మన్ వివరించారు. ఇటీవల ‘చాట్‌జీపీటీ’కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండటంతో.. విద్యార్థుల నుంచి వృత్తి నిపుణుల వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు. అయితే, ఇలాంటి కృత్రిమ మేధతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం పనికిరాదట. స్వయంగా చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ (OpenAI CEO Sam Altman) ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.