తమాషాలు అనుకోవద్దు.. అధికారులపై సీఎం సీరియస్
తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. “భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు? అని టీటీడీ జేఈవో గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? అని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు.

