నా మాటలను పక్కదోవ పట్టించొద్దు: రామ జోగయ్య శాస్త్రి
తెలుగు లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి నెటిజన్లకు విన్నపం అంటూ, తాను మాట్లాడిన మాటలకు విపరీతార్థాలు తీయవద్దు అంటూ నెటిజన్లను కోరారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.172 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా సాధించిన విజయం పట్ల చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో కళ్యాణ్ రామ్‌తో పాటు కొరటాల శివ, దిల్ రాజు, రామ జోగయ్య శాస్త్రి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే, విజయం నల్లేరు బండి మీద నడకలా సాగుతుంది అనే నానుడి ఉంది కదా, అంటూ ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు కొరటాల శివ అన్న మాటలు తనకు బాగా నచ్చుతాయని, దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని ఈ దేవర ద్వారా నిరూపితమైంది అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. అయితే దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ఇది మెగా హీరోలను ఉద్దేశించే ఇలా అన్నారని.. ఆచార్య సినిమాలో మెగా హీరోలు వేలు పెట్టకుంటే మూవీ ఇంకోలా ఉండేదని కామెంట్లు వస్తున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలు వివాదం రేపేలా ఉన్నాయని తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు శాస్త్రి.
ఓరి నాయనో ఈ టాపిక్.. ఇది ఎటు దారి తీస్తుందో అన్నట్టుంది.. నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారని చెప్పాను తప్ప, మరొకటి కాదు విపరీతార్ధాలు తీయవద్దని మనవి. అంటూ రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు.