చంద్రబాబు అరెస్టుకు భయపడొద్దు… పార్టీ శ్రేణులకు బాలయ్య భరోసా
స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు జరిగిన స్వాతంత్ర సంగ్రామం మనం చూడలేదని ఆస్ఫూర్తితో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పోరాటంలో తాను ముందు ఉంటానని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అలానే అందరిని పంపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని అలాగే వేల మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచిపోయారా అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని త్వరలో స్వయంగా వెళ్లి పరామర్శించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.

