భూములు గుంజుకునే కేసీఆర్‌ను సాగనంపండి: గజ్వేల్‌లో ఈటల పిలుపు
గజ్వేల్ నియోజకవర్గం తూఫ్రాన్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇమాంపూర్ గ్రామంలో 652 ఎకరాల భూమి 50 ఏళ్ల క్రితం దళితులకు అసైన్డ్ చేశారు. ఆ భుములమీద కేసీఆర్ కన్ను పడింది. గుంజుకోవడానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, భూమిని తిరిగి వారికే అప్పగిస్తామని హామీ ఇస్తున్నా. కేసీఆర్ వల్ల గజ్వేల్ ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. తుఫ్రాన్ మండలం, మనోహరాబాద్ మండలంలో 5600 ఎకరాలు గుంజుకొని గరీబోళ్ల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్. దాని నాయకుడు కేసీఆర్. గరీబోళ్లకు ఖరీదైన భూములు ఉండొద్దు అని పంతమా? మన నియోజకవర్గ నుంచి ముఖ్యమంత్రి అయితే మనకు బాగు చేస్తారనుకున్నారు కానీ భూములు గుంజుకొని బిచ్చగాళ్లను చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు, కానీ బెల్ట్ షాపులు పెట్టి తాగుబోతులు చేశాడన్నారు ఈటల. బీజేపీకి అధికారం ఇస్తే ఒక ఎకరా కూడా దళితుల నుంచి గుంజుకోం. నరేంద్ర మోదీ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తాం. ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తాం. పది లక్షల రూపాయల ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తాం. ఇన్నాళ్ళు మనల్ని పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వచ్చి మనల్ని ప్రలోభ పెట్టి, ఆశ చూపించి ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు . ధర్మం న్యాయం బతకాలంటే బీఆర్ఎస్ పార్టీని బొందపెటాలి. కేసీఆర్‌ను ఓడగొట్టాలి. ఏ ఓటు వేసి ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారో, అదే ఓటుతో దెబ్బ కొట్టాలి. కేసీఆర్ ఓడితేనే తెలంగాణకు విముక్తి లభిస్తుందని ఈటల చెప్పారు.

