వరద బాధితులకు నెల జీతం విరాళం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇస్తారని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో పంజాబ్‌కు అండగా నిలవాలని, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ఇబ్బందుల్లో ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 96,000 హెక్టార్లకు పైగా పంటలు నీట మునిగాయి. జలంధర్, అమృత్సర్, బర్నాలా, హోషియార్పూర్, లూధియానా, మాన్సా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఇక మంగళవారం కూడా వర్షాలు కొనసాగాయి. గత 24 గంటల్లో మొహాలీలో అత్యధికంగా 44.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.