అమెరికా అధ్యక్షుడి పోటీలో ఉన్న భారతీయుడ్ని ఆకాశానికెత్తిన ట్రంప్
రిపబ్లికన్ ప్రైమరీ పోల్, CBS YouGovలో భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి సత్తా చాటుతున్నాడంటూ కితాబిచ్చాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2024 అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నానంటూ వివేక్ రామస్వామి ఇప్పటికే ప్రకటించారు. ఈసారి రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, డోనాల్డ్ ట్రంప్, భారతీయ-అమెరికన్ నిక్కీ హేలీతో పాటు అనేక మంది పోటీపడుతున్నారు. తాను వివేక్ రామస్వామిని ఇష్టపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ పాలనలో చేసిన మంచి పనుల గురించి మాత్రమే వివేక్ చెప్పగలడన్నారు. “ఇటీవలి రిపబ్లికన్ ప్రైమరీ పోల్, CBS YouGovలో వివేక్ రామస్వామి బాగా రాణిస్తున్నందుకు సంతోషిస్తున్నాను” అని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ట్రూత్ సోషల్‌లో రాశారు. “ఐతే వివేక్ మైక్ పెన్స్ పనితీరు ఆధారంగా ముందుకు సాగుతాడు. రాన్ డిసాంక్టిమోనియస్‌ని వివేక్ అడ్డుకోవచ్చు. వివేక్‌లో నచ్చిన విషయం ఏమిటంటే, “అధ్యక్షుడు ట్రంప్” గురించి చెప్పడానికి మంచి విషయాలు మాత్రమే ఆయన వద్ద ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజుల్లో విజయవంతంగా పనిచేసింది.” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఫిబ్రవరిలో, హెల్త్‌కేర్, టెక్ రంగ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. “మేము మా “వైవిధ్యాన్ని” ఎంతగానో జరుపుకున్నాం, నిజంగా అమెరికన్ల మాదిరిగానే ఉన్నాం, 250 సంవత్సరాల క్రితం విభజించబడిన, తలలు పట్టుకున్న వ్యక్తుల సమూహాన్ని ఏకం చేసిన ఆదర్శాలకు కట్టుబడి ఉన్న అన్ని మార్గాలను మనం మరచిపోయాం. అవి ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా” అని రామస్వామి ఒక వీడియోను ట్వీట్ చేశారు.

ఇది కేవలం రాజకీయ ప్రచారం కాదని, “సాంస్కృతిక ఉద్యమం” అని పునరుద్ఘాటించాడు. “విశ్వాసం, దేశభక్తి, కృషి కనుమరుగయ్యాయి. వోకీయిజం, క్లైమాటిజం, వ్యక్తుల భావజాలం వాటి స్థానంలోకి వచ్చాయి. అమెరికా ఏంటనేది తిరిగి చెప్పాలని తాము ఆకలితో ఉన్నాం, ఆ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం” అన్నారు. రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లకు సంబంధించిన CBS న్యూస్/యూగోవ్ సర్వేలో, ఐక్యరాజ్యసమితిలో మాజీ US రాయబారి నిక్కీ హేలీ కంటే రామస్వామి ముందున్నారు. 37 ఏళ్ల వివేక్ రామస్వామి ఒహియోకు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తల్లి మానసిక వైద్యురాలు, తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు. వైవిధ్యం మన బలం కాదని రామస్వామి, భేదాల మధ్య మనల్ని ఏకం చేసే ఆదర్శాల సమాహారమే మన బలం. అది లేకుండా, “వైవిధ్యం” అర్థరహితం.” అన్నారు. నిక్కీ హేలీ తర్వాత 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ ప్రైమరీలో ప్రవేశించిన రెండో భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి.