పోలీసుల అత్యాచారం, వేధింపులతో వైద్యురాలి సూసైడ్
పుణె : సతారా జిల్లాలో ఒక వైద్యురాలి సూసైడ్ చేసుకున్నారు. ఆమె అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎందుకంటే దానిలో ఆమె ఒక ఎస్సై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బీద్ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం ఆమె హోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆమె చేతిపై ఉన్న సూసైడ్ నోట్ గుర్తించారు. సతారా పోలీసులైన ఇద్దరు తనను ఐదునెలలుగా వేధిస్తున్నారని, ఎస్సై గోపాల్ బదానే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, మరో పోలీస్ ప్రశాంత్ బంకర్ మానసిక వేధింపులకు గురిచేశాడని ఆ నోట్ లో ఆరోపించారు. దీనితో ఈ విషయం సంచలనంగా మారింది. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ సతారా ఎస్పీతో మాట్లాడి, వెంటనే ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో ఆమె బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఆమెను తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఒత్తిడి చేశారని, దీనిపై ఆమె ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

