చేగువేరా బొమ్మ పెట్టుకొని బీజేపీకి ఊడిగం చేస్తావా!
జనసేనాని పవన్ కల్యాణ్ తీరును ఎండగట్టారు సీపీఎం సీనియర్ నేత రాఘవులు. మోదీ ఎక్కడికి వస్తే అక్కడకు వెళ్లి చర్చలు జరపడం పవన్ కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. భేటీ తర్వాత, చర్చలు చాలా సుహృద్భావంగా జరిగాయని… అందరికీ మంచి జరుగుతుందని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ చేగువేరా షర్ట్ ధరించేవాడని… కానీ ఈ మధ్య ఆ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకోవడం లేదన్నారు. ప్రాణమిచ్చి పోరాడాలన్నది చేగువేరా లక్షణమని… చేగువేరా బొమ్మ పెట్టుకొని కార్మికులకు, కర్షకులకు నష్టం చేసేవారికి ఊడిగం చేయడం పవన్ కల్యాణ్‌కే చెల్లిందన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరమంటూ తేల్చేశారు. బీజేపీతో జరుగుతున్న నష్టాన్ని దేశంలో అన్ని పార్టీలు గుర్తించినా, ఏపీలోని టీడీపీ, వైసీపీ, జనసేన మాత్రం మేల్కోవడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో సీపీఎం నేత రాఘవులు పాల్గొన్నారు.

