Home Page SliderTelangana

“సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా?”..బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ ఈరోజు (25.07.2024) హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారీ భూములను అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన తన లేఖలో ఇలా పేర్కొన్నారు. “గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క గారు….మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..?అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు?

12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది? రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా? రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి. జాతీయ వ్రుద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది.

90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే… 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం” అంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు.