కొడాలి కేకలు… చంద్రబాబు పరామర్శలు
గన్నవరం వ్యవహారం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కొడాలి నాని. గన్నవరం ఘటన తర్వాత 15 మందిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు కేవలం ఒక్క పట్టాభిని మాత్రమే పరామర్శించారని.. కమ్మ వాళ్లు తప్ప మరెవరూ కన్పించలేదా అంటూ మండిపడ్డారు. కొడాలి ఆరోపణలను పక్కనబెడితే చంద్రబాబు ఇవాళ ఆ ఘటనలో అరెస్ట్ అయిన బీసీ నేతల ఇళ్లకు వెళ్లారు. రిమాండ్‌లో ఉన్న బీసీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి వివరాలను చిన్నా కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వివరించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఇక గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. పెట్రోల్, రాళ్లతో వచ్చి రౌడీలు దాడి చేశారన్నారు. ఐదు కార్లు, 2 బైక్‌లు ధ్వంసం చేశారన్నారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి, స్వైరవిహారం చేశారన్నారు. రౌడీలు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. పోలీసుల వింత చేష్టలు అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే జైలుకు పోక తప్పదన్నారు. బెదిరిస్తే పారిపోతారానుకుంటున్నారని.. కానీ పోరాడుతూనే ఉంటామన్నారు. చంద్రబాబు టీడీపీ కార్యాలయం వద్దకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు.