నడిచే చేపల గురించి మీకు తెలుసా?
నడిచే చేపల కింది భాగంలో నాలుక మీద ఉండే రుచి మొగ్గలు ఉంటాయి. వాటి సహాయంతో ఆహారం జాడ కనిపెడతాయి. అలాంటి చేపలను సీ రాబిన్ చేపలు అని అంటారు. సీ రాబిన్ చేపల్లో కొత్త రకం జాతుల వైవిధ్యమైన లక్షణాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. సీ రాబిన్స్ చేపల్లోని ప్రియోనాటస్ కారోలైనస్ జాతుల మొప్పల వెనకాల రెక్కలతోపాటు, కిందిభాగంలో పీత ఉన్న మాదిరిగా ఆరు కాళ్లను గుర్తించారు. చేప ఈ కాళ్లతో సముద్రగర్భం అడుగుభాగంపై చకచకా నడుస్తాయి. ఆ కాళ్లకు మరో ప్రత్యేకత ఉంది. వాటి అడుగున ఉన్న పాదాల్లాంటి మెత్తని భాగానికి జ్ఞానేంద్రియం లాంటి గుణం ఉండటం విశేషం.
సముద్రం అడుగున మట్టి కింద ఏదైనా చిన్న జీవి దాక్కున్నా, ఇంకేదైనా ఆహారం ఉన్నా ఈ చేప తన కాళ్లతోనే గుర్తించగలదు. అవసరమైతే మట్టిలో కూరుకుపోయిన ఆహారాన్ని తవ్వి బయటకు తీయగలదు. మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కల్గిన చిన్న జీవి జాడనూ చేప గుర్తించగలదు. అక్కడి ఆహారం జీవి నుంచి విడుదలయ్యే రసాయనాలను గుర్తించే ఏర్పాట్లు సీ రాబిన్ పాదాల్లో ఉన్నాయి. పాదాల్లోని నరాలు అనుగుణంగా స్పందిస్తాయి. మనిషి నాలుక మీద ఉండే రుచి మొగ్గల లాంటి బొడిపెలు ఈ చేప పాదాల కింద ఉన్నాయి. వీటి సాయంతో అది తన ఆహారం జాడ కనిపెడుతోంది. ఇలాంటి కొత్త విషయాలతో కూడిన అధ్యయన వివరాలు తాజాగా ‘కరెంట్ బయోలజీ’సైన్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి.

