“నీకు నగరిలో తిరిగే దమ్ముందా?” మంత్రి రోజాకు అనిత సవాల్
వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో తిరిగే హక్కులేదన్నారు టీడీపీ నేత అనిత. మంత్రి రోజాకు నగరిలో తిరిగే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ,జనసేనకి దమ్ముంటే ఏపీలో ఇంటింటికి వెళ్లి ఏం చేశారో చెప్పగలరా? అని రోజా టీడీపీకి సవాల్ విసిరిన నేపథ్యంలో తెలుగుదేశం నేత వంగలపూడి అనిత ఈ విధంగా స్పందించారు. ప్రజలను మభ్యపెట్టడానికి కేవలం సంచులిచ్చి 150 మంది ఎమ్మెల్యేలను రోడ్డుమీదకి ముఖ్యమంత్రి పంపిచారని ఎద్దేవా చేశారు. పైగా ఆ సంచులపై ఎక్కడా ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు లేవని, కేవలం వారి జగనన్న ఫోటో మాత్రమే ఉందన్నారు. రాష్ట్రం కోసం కాకుండా జగన్ కోసం మాత్రమే పనిచేసే మంత్రులు, పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశంలో ఇంకెక్కడా కనిపించరన్నారు. మంత్రి రోజా తెలుగుదేశం పార్టీకి చేసిన సవాల్‌కి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా తాను సవాలు స్వీకరిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. నగరికి రమ్మన్నాసరే, హైదరాబాద్ రమ్మన్నా సరే తాను సిద్ధమేనన్నారు. నగరిలో రోజాకు తిరిగే హక్కు లేదన్నారు.

