వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా..
వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్, రోడ్లపై దొరికే పానీయాలు తీసుకుంటే డయేరియా పాలయ్యే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాలలో ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే దానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాక మరిన్ని జాగ్రత్తలు వర్షాకాలంలో పాటించవలసిన అవసరం ఉంది. కాచి, చల్లార్చిన నీటిని తీసుకోవడం, ఇంటిని తరచూ శుభ్రం చేసుకోవడం అవసరం. వర్షం నీటిలో తడిచి ఇంటికి వెళితే తప్పకుండా స్నానం చేయాలి. అంతేకాదు ఈ కాలంలో చేపలు వంటి సీఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది. వరద నీటిలో కొట్టుకువచ్చిన చేపలు, రొయ్యలు వంటివి అనారోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అలాగే వర్షాకాలం వేడిగా బాగుంటుందని నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. చిప్స్, మసాలా పదార్థాలకు దూరంగా ఉండడం మేలు. ఉడికించిన గింజలు, సలాడ్స్, కూరగాయలు, పప్పుధాన్యాలు తినవచ్చు. అలాగే ఆకుకూరలు బాగా కడిగి తినడం మంచిది.