చిన్నపిల్లలకు ‘మాస్కు’ వాడొద్దు
చిన్నపిల్లలకు మాస్కు వాడడం వలన ప్రమాదమే ఎక్కువ అని వైద్యులు చెపుతున్నారు. అంటువ్యాధుల నిపుణుల సలహా ప్రకారం చిన్నారులు మాస్కులను సరిగా వినియోగించకపోతే దానివల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశముంది. కొవిడ్ తీవ్రస్తాయిలో ఉన్నప్పుడు కూడా ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు వాడొద్దని హెచ్చరించారు వైద్యులు. ప్రస్తుతం పాండమిక్ స్థాయి నుండి ఎండమిక్ దశలోకి కొవిడ్ చేరుకుంటోంది. అంటే ఇకమీదట మహమ్మారిలా కొవిడ్ విజృంభించదు. సాధారణ జలుబు, ఫ్లూ స్థాయికి మారిపోతోంది. అందుకే 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా మాస్కులు ధరించవలసిన అవసరం లేదని, వారికి మాస్క్ వల్ల ఉపయోగం లేదని పేర్కొన్నారు. వారు కేవలం చేతులు కడుగుకుంటూ పరిశుభ్రత పాటిస్తే చాలని వివరిస్తున్నారు. ఆటలలో ఉన్నప్పుడు అసలు మాస్కును వాడకూడదని సూచిస్తున్నారు. దీనివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

