Andhra PradeshHome Page Slider

పోలీసులు పై దాడి చేస్తే కేసులు పెట్టొద్దా : సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయటం కేసులు పెట్టడం టీడీపీకి రివాజుగా మారిందని ఆ తప్పును మాత్రం అధికార పార్టీపై నెట్టేసి విష సంస్కృతిని ఆ పార్టీ ఆవలంబిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గన్నవరం ఘటనతో టీడీపీ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని ఆయన మండిపడ్డారు. పోలీసులపై దాడి చేస్తే కేసులు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు. గన్నవరంలో దాడికి తామే సూత్రధారులుగా తప్పుడు చర్యలకు పాల్పడి తద్వారా ఉత్పన్నమయ్య పరిణామాలకు తిరిగి ప్రభుత్వాన్నే బాధ్యత చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్న భ్రమలను కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు లేనిపోనీ హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త బుట్టలో పడేయటం లేదా ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ఎదురు దాడులు చేయడం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం టీడీపీకి అలవాటుగా మారిందన్నారు. టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తే కానీ రాష్ట్రానికి విముక్తి కలగదన్నారు. గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సింది కాదని ఘటనను తాము సమర్ధించటం లేదన్నారు. కానీ, అసలు ఘటనకు కారకులెవరు..రెచ్చగొట్టింది ఎవరో ఆలోచన చేయాలని సూచించారు. అక్కడకు వంశీ వెళ్లకపోవటమే సంయమనం పాటించటమని సజ్జల చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించామని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రచారం కోసం టీడీపీ తాపత్రయ పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు రోజుల క్రితం గన్నవరంలో చోటు చేసుకున్న ఘటనలు.. జరుగుతున్న ప్రచారంపైన సజ్జల స్పందించారు. నాలుగు రోజులుగా మాటలు మంటలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ను గన్నవరం లో పోటీ చేయమని వంశీ వ్యాఖ్యానిస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారన్నారు. విజయవాడలో ఉండే పట్టాభి గన్నవరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ హయాంలో ఉన్నట్లు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ నేతలే అరాచకాలు సృష్టించి.. వైసీపీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా పట్టాభిని చంద్రబాబు అన్ని రకాలుగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఏ ఒక్కరూ పట్టాభికి మద్దతుగా లేరన్నారు. చంద్రబాబుకు చట్టాలన్న పోలీసులు అన్న గౌరవం లేదని నిర్లజ్జగా మళ్ళీ యాత్రలు చేస్తున్నాడని అలాంటప్పుడు పోలీసులు ఎందుకు గౌరవం ఇవ్వాలని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త కాదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు తదితరులపై ఎంత దాష్టీకాన్ని చంద్రబాబు ప్రదర్శించారో ప్రజలకు తెలుసు అన్నారు.