స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలయ్యింది. విజయవాడ వరలక్ష్మీనగర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లాంఛనంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌకబియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. “సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం. కొత్తవారికి, చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా అందజేస్తాం. డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాలను ఆధునికీకరిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.