ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ
•రాగి జావ పంపిణీకి ఏడాదికి రూ.84 కోట్ల ఖర్చు
•రూ.1,910 కోట్లతో 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
•వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాగి జావ అందించడం ద్వారా విద్యార్థుల్లో ఐరన్, క్యాల్షియం లోపం రాకుండా ముందుగానే నివారించవచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ద్వారా సీఎం జగన్ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. పేద విద్యార్థులకు మంచి చేసేలా దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, చిన్నారులకు రుచికరంగా ఆహారం వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా, స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? విద్యార్థుల్లో మేథో వికాసాన్ని పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గర్భవతుల నుంచి పాఠశాల విద్యా పూర్తయ్యే వరకు చిన్నారులకు పౌష్ఠికాహారం అందించే కార్యక్రమాన్ని వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరో తరగతి నుంచి ఏర్పాటు, 8 వ తరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీ ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక ద్వారా విద్యార్థుల చదువు భారాన్ని ప్రభుత్వమే మోస్తోందని సీఎం జగన్ వివరించారు. ఉన్నత విద్యా చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఏపీ విద్యార్థులు భావి ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేయడమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాక ముందు ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. మన బడి నాడు నేడు కింద ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని కోరారు. మొత్తం ఏడాదికి కూడా ప్రభుత్వ పాఠశాలల కోసం గతంలో రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు.. సరుకుల సప్లై చేసే వారికి కూడా 6-8 నెలలుగా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని గుర్తుచేశారు. ఇలాంటి బకాయిల ప్రభుత్వం ఏ క్వాలిటీ ఆహారం అందించిందో మీకే బాగా తెలుసన్నారు. కానీ మన ప్రభుత్వం గోరు ముద్ద ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రతిష్ట్మాతకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నామని, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారో నిత్యం మానిటర్ చేస్తున్నారని.. గతంలో ఇలాంటి పరిస్థితులు మచ్చుకు కూడా ఉండేవి కాదన్నారు. పిల్లలకు మంచి మేనమామలా మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. వారంలో 5 రోజుల పాటు ఉడికించిన గుడ్లు, 3 రోజులు చిక్కీ, మరో 3 రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నానని సీఎం అన్నారు.