కేసీఆర్ ప్రధాని కావాలని కోడి, మద్యం పంపిణీ..!
కేసీఆర్ ప్రధాని కావాలని.. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీఆర్ఎస్ నేత ఒకరు హమాలీలకు ఒక కోడి, క్వార్టర్ మద్యం బాటిల్ పంచారు. దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టారు. విజయదశమి సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి విజయాలు అందించాలంటూ ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు.
మద్యం పంపిణీనా.. హవ్వా..!
శ్రీహరి చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కోడిని పంచి పెట్టడం ఓకే.. మద్యం పంపిణీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా కార్యకర్తల్లో జోష్ కు ఇది నిదర్శనమని కొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అధికార పార్టీ నాయకులే మద్యం పంపిణీ చేస్తే మద్యాన్ని అరికట్టేదెవరు? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ..? అని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్ వేశారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


