మంత్రి రజినీకి అసమ్మతిపోటు, పార్టీ సమన్వయకర్తకు నేతల కంప్లైంట్
చిలకలూరిపేట రాజకీయాలు రాష్ట్రంలోనే సంథింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక్కడ్నుంచి గెలిచినవారికి ప్రభుత్వంలోనూ, ఆయా పార్టీల్లోనూ కీలక పదవులు లభించడం ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి అనూహ్యంగా టికెట్ పొంది, విజయం సాధించిన విడదల రజినీ విషయంలో నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పార్టీ నేతలతో ఆమె సఖ్యతగా ఉండేవారు కాదన్న ప్రచారం ఉంది. తాజాగా మంత్రి పదవి వచ్చాక ఆమె తీరు మరింత దారుణమయ్యిందని పార్టీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మంత్రి విడదల రజినీకి టికెట్ ఇస్తే… తాము సహకరించేది లేదంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, పార్టీ సమన్వయకర్త బీద మస్తాన్‌రావుకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లాలో ఓ హోటల్లో అసమ్మతి నేతలు, బీద మస్తాన్ రావును కలిసి తమ వాదన వివ్పించారు. యడ్లపాటు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలకు చెందిన నేతలు, పల్నాడు ప్రాంతీయ సమన్వయకర్త బీద మస్తాన్ రావుతో సమావేశమై.. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న తమను కనీసం గౌరవించడం లేదని వారు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తనే పోటీ చేస్తానని రజినీ ప్రకటించడంపై వారు మండిపడుతున్నారు.

ఒకవేళ పార్టీ ఆమెకే టికెట్ కేటాయిస్తే తాము సహకరించే ప్రసక్తే లేదని వారు కుండబద్ధలుకొట్టేశారు. పార్టీ రజినీకి టికెట్ ఇస్తే, స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలుపుతామంటూ వారు హెచ్చరించారు. అయితే తొందరపడొద్దని, పార్టీ పెద్దలకు సమాచారం చెబుతానంటూ నేతలను బీద మస్తాన్ రావు సముదాయించారు. రజినీకి టికెట్ ఇవ్వకుంటే తాము పార్టీకి విధేయులుగానే ఉంటామని.. అలా కాదని ఆమెకు టికెట్ ఇస్తే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని… వారు సమన్వయకర్తకు తేల్చి చెప్పారు. బీద మస్తాన్ రావును కలిసినవారిలో కంజుల వీరారెడ్డి, గొంటు శ్రీనివాసరెడ్డి, కోవెలమూడి సాంబశివరావు, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, జాలాది సుబ్బారావు, గంటా హరికృష్ణ ఉన్నారు.

