NewsTelangana

విచ్ఛిన్నకర శక్తులు పొంచి ఉన్నాయి- కేసీఆర్

తెలంగాణాలో అశాంతిని సృష్టించేందుకు విచ్ఛిన్నకర, మతోన్మాద శక్తులు పొంచి ఉన్నాయని, అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను భగ్నం చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రారంభంచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గన్‌పార్క్‌ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

నాటి పోరాట యోధులను స్మరించుకుందాం..

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కంటే ముందు దేశంలోని చాలా ప్రాంతాలు, సంస్థానాలు వేర్వేరు రాజుల చేతుల్లో ఉండేవని, అవన్నీ వేర్వేరు సమయాల్లో భారత్‌లో విలీనమయ్యాయని గుర్తు చేశారు. నాడు ప్రజా పోరాటాలు చేసిన, ప్రాణాలు అర్పించిన యోధులను స్మరించుకుందామని, వారందరి కృషితోనే ఇప్పటి భారత్‌ దర్శనమిస్తోందని కొనియాడారు. ‘కోమరం భీం, దొడ్డి కొమరయ్య సాహసాలు, చాకలి ఐలమ్మ స్ఫూర్తిని మరువలేం. తెలంగాణ ప్రజల పోరాటం, నాటి పాలకుల కృషి వల్లే రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేశాం. నాటి ఉజ్వల ఉద్యమాన్ని, అమర వీరులను తలుచుకోవడం మన కర్తవ్యం. మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కట్టబడి ఉందాం’ అని పిలుపునిచ్చారు.

తెలంగాణాను మలినం చేసే కుట్ర..

స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బలవంతంగా కలిపారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఏమరపాటుగా ఉండటంతో 58 ఏళ్లు ఎంతో నష్టపోయామని.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని.. చరిత్రను వక్రీకరించి తెలంగాణాను మలినం చేసే కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. రెప్పపాటు కాలం అదమరిచినా విచ్ఛిన్నకర శక్తులు, మతోన్మాదులు రెచ్చిపోయి తెలంగాణాను మళ్లీ ఊబిలోకి లాక్కెళ్తాయని హెచ్చరించారు.