NewsTelangana

ఈటలపై సర్కార్ సస్పెన్షన్ కుట్ర..?

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు కేసీఆర్‌ సర్కారు కుట్ర పన్నుతోందా? స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని ఈటల `మర మనిషి` అనడం టీఆర్‌ఎస్‌ నాయకులకు అస్త్రంగా మారింది. స్పీకర్‌ పోచారం మర మనిషిగా వ్యవహరిస్తున్నారని, సీఎం చెప్పింది చేయడం తప్ప స్పీకర్‌ వేరే పనేమీ చేయడం లేదని ఈటల ఆరోపించారు. బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను పిలవకపోవడంపై పై విధంగా మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్షమాపణ చెప్పాలి: వేముల

ఈటల వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌ను మర మనిషి అని కించ పరచడం దుర్మార్గమన్నారు. స్పీకర్‌కు ఈటల బేషరతు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. దీన్నిబట్టి ఈటలపై చర్య తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. ఈటల క్షమాపణ చెబితే ఈ సమస్యను వదిలేద్దామని.. లేకుంటే ఆయనపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాబలంతో ఎన్నికల్లో గెలిచిన ఈటలపై మరోసారి సర్కారు పెద్దలు కుట్ర చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.