Home Page SliderNational

అర్ధరాత్రి మహిళలకు “దిశా”నిర్దేశం

 మన దేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని మహత్మగాంధీ ఎప్పుడో అన్నారు. అయితే ఆ మాటలను ఇప్పుడు నిజం చేసింది “దిశ యాప్”. అర్ధరాత్రి నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటున్న మహిళలకు మేము ఉన్నాం అంటూ  “దిశ యాప్” అభయమిచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తమ కూతురితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అయితే అర్దరాత్రి నడిరోడ్డుపై ఆమె కారు పంక్చర్ అయ్యింది. కాగా ఆ ప్రదేశం చిమ్మచీకటితో ఎంతో అమానుషంగా ఉంది. దీంతో కారు డోరు తెరిస్తే ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో అనే భయం వారిద్దరిని బెంబేలెత్తించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి అని వారు ఆలోచించారు. కాగా వారికి వెంటనే “దిశ యాప్” గుర్తుకొచ్చింది. దీంతో వారు వెనువెంటనే దిశయాప్ తెరిచి ఎస్.ఓ.ఎస్ కాల్ చేశారు. అయితే కాల్‌కు తక్షణమే స్పందించిన మర్రిపాడు  పోలీసులు నిమిషాల వ్యవధిలోనే వారి వద్దకు చేరుకుని, వారి సమస్యను  పరిష్కరించారు.  అంతేకాకుండా పోలీసులు ఆ తల్లి,కూతుళ్లు ఇద్దరు గమ్యం చేరేలా సహకరించారు. దీంతో ఆ తల్లి,కూతుళ్లు ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం విన్నవారంతా నెల్లూరు జిల్లా పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసిస్తున్నారు.