చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా సంస్థ కొత్త అంశాలను వెలికితీసింది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరికొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుండి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జులై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు పొలిటికో వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది.

