Andhra Pradesh

సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే అధికార మార్గంలో కాకుండా మరో దారిలో సీఎం నివాసానికి రామ్ గోపాల్ వర్మ రావటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రస్థానంపై లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించిన రామ్ గోపాల్ వర్మ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్ కు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగడుతూ వినూత్న చిత్రాన్ని నిర్మించాలని యోచనలో భాగంగానే సీఎం జగన్ ను వేరే మార్గం ద్వారా క్యాంప్ కార్యాలయానికి చేరుకొని కలిసినట్లు తెలియ వచ్చింది. ఇరువురు మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశంపై సినిమా తీస్తున్నారా, వైసీపీ చెప్పే దుష్ట చతుష్టయంపై తీస్తారా ప్రతిపక్ష పార్టీల మధ్య అనైతిక పొత్తుల అంశాలపై రాబోయే ఎన్నికల నాటికి సినిమా ఉంటుందా? అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మరి రానున్న ఎన్నికల నాటికి రాంగోపాల్ వర్మ ఏ సినిమాతో తెర మీదకు వస్తారో వేచి చూడాల్సి ఉంది.