‘కల్కి’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా?
ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ అభిమానులూ, భారతీయ సినీప్రియులంతా నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ‘కల్కి’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? నిరాశపరచిందా? అనేది తెలుసుకుందాం. బాహుబలి చిత్రంతో ప్రభాస్ భారతీయ నటుడయిపోయాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి లాంటి చిత్రాన్ని తీసి, జాతీయ అవార్డు కొట్టేశారు. వీరిద్దరి కాంబినేష్‌లో వచ్చిన ఈ “కల్కి” చిత్రంలో ఎన్నో మెరుపులు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి హేమాహేమీలు ఉన్న ఈ చిత్రానికి మహా భారత కథకు సంబంధం ఉండడం కూడా ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది.

భవిష్యత్తు ప్రపంచాన్ని ఊహించి, శ్రీమహావిష్ణువు కల్కి అవతారం కోసం ఫాంటసీగా తీసిన చిత్రం ఇది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆరువేల ఏళ్లకు మొదలయిన ఈ కథలో భూమిపై సమస్త ప్రాణులూ నశించిపోతాయి. చిట్టచివరి నగరంగా మిగిలిన కాశీ పట్టణంలో గంగానది అంతరించిపోయి ఉంటుంది. భూమిపై వనరులను తీసుకెళ్లి స్వర్గంలాంటి కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని ఆకాశంలో నిర్మించి పరిపాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్(కమల్ హాసన్). అతడు చేసే ప్రయోగాల కోసం గర్భం ధరించిన అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోతూ ఉంటారు సైన్యం. అలా సుమతిని (దీపికా పదుకొనే) తీసుకెళ్లే ప్రయత్నంలో అశ్వద్ధామ(అమితాబ్) అడ్డుకుంటాడు. డబ్బు సంపాదించి కాంప్లెక్స్‌లో స్థిరపడదామని కలలు కనే భైరవ(ప్రభాస్) ఈ విషయంలో ఏం చేసాడు. సుప్రీం యాస్కిన్‌ను ఎలా ఎదుర్కొన్నారు. సుమతిని ఆమె గర్భంలోని కల్కిని ఎలా కాపాడారన్నదే కథ. ఈ చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన భవిష్యత్తు ప్రపంచం. మేటి నటులందరూ వారి పాత్రలలోనే కనిపిస్తారు తప్ప మనకు యాక్టర్స్ కనిపించరు. ప్రభాస్ పాత్రలో మరొకరిని ఊహించలేనంతగా ఒదిగిపోయాడు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.