మునుగోడులో కమ్యూనిస్టుల లెక్క తప్పిందా..?
మునుగోడు, మనసర్కార్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడంలో తమ లెక్క తప్పిందని కమ్యూనిస్టు పార్టీల నాయకులు బాధపడుతున్నారా..? బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో.. ఆ పార్టీని ఓడించే సత్తా ఉందన్న నమ్మకంతో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని సీపీఐ, సీపీఎం నాయకులు ప్రకటించారు. అయితే.. గెలిచే సత్తా ఉందని కమ్యూనిస్టులు నమ్మిన టీఆర్‌ఎస్ పార్టీనే బీజేపీతో మెతకవైఖరి ప్రదర్శిస్తోందా..? బీజేపీకి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఇచ్చిన ఆఫర్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అసహనానికి కారణమేంటి..?

రూ.18 వేల కోట్ల చుట్టూ మునుగోడు రాజకీయం..
మునుగోడు ఉప ఎన్నిక రూ.18 వేల కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మోడీ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్లు ఇప్పిస్తే మునుగోడు బరి నుంచి తప్పుకుంటామని, సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మరీ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తామని.. నిధుల కోసం ప్రధాని మోడీని ఒప్పిస్తారా.. అని బీజేపీ నాయకులకు మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ సవాల్ విసిరారు.

బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి..
దీనిపై బీజేపీ నాయకులు స్పందించలేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌ల ప్రకటనలు బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరిని సూచిస్తున్నాయని.. ఇది సరికాదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ డబ్బుల కోసమే మునుగోడులో పోటీ చేస్తోందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో తమకు పంచాయితీ లేదని చెప్పాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి.. కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పడితే బీజేపీని సమర్ధిస్తారా.. అని తమ్మినేని అనుమానం వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టులకే అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్..
నిజానికి.. బీజేపీతో టీఆర్‌ఎస్ మెతక వైఖరి ప్రదర్శించడం ఇది తొలిసారి ఏమీ కాదు. గత 8 ఏళ్లుగా ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. పైగా.. వామపక్ష నాయకులనే ప్రగతి భవన్ గేటు కూడా దాటనీయలేదు. సీపీఐ, సీపీఎం నాయకులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. మునుగోడులో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంకు ఉండటంతో కేసీఆర్ ప్లాన్ మార్చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులను అక్కున చేర్చుకొని వారి మద్దతు కోరారు. వామపక్ష నాయకులు గతాన్ని మర్చిపోయి.. బీజేపీ వ్యతిరేకత అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని.. టీఆర్‌ఎస్‌కు మద్దతు అంటూ ముందుకొచ్చారు.

టీఆర్‌ఎస్ వైఖరి మార్చుకుందా..?
సీపీఎం బెదిరించగానే టీఆర్‌ఎస్ తన వైఖరి మార్చకుందంటే వామపక్ష నాయకులు తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరమైనప్పుడు వామపక్ష నాయకులను దగ్గరికి తీసుకోవడం.. అవసరం తీరగానే వాళ్లను దూరం నెట్టేయడం కేసీఆర్‌కు అలవాటే అన్నారు. అలవాటు కానిదల్లా వామపక్ష నాయకులకే అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము బెదిరించగానే టీఆర్‌ఎస్ నేతలు సందిగ్ధంలో పడ్డారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని మాటిచ్చారని వామపక్ష నాయకులు చెప్పడమూ సొంత డబ్బా కొట్టుకోవడమే అని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ భవిష్యత్తులో బీజేపీ పంచన చేరితే కమ్యూనిస్టుల లెక్క తప్పినట్లేనని.. ఇలాంటి లెక్కలు వాళ్లకు గతంలో ఎన్నోసార్లు తప్పాయని.. అయినా వాళ్ల వైఖరి మారదని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.