‘ఆదిపురుష్’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
ఎన్నో భారీ అంచనాల మధ్య విజువల్ వండర్‌గా రామాయణ దృశ్యకావ్యాన్ని తెరపై నిల్పిన ‘ఆదిపురుష్’ చిత్రం రిలీజ్ ఈ రోజే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో రాముడిగా, అందాల తార కృతిసనన్ సీతగా నటించిన ఈ భారీ చిత్రం అంచనాలను అందుకుందా? ప్రేక్షకులకు రామాయణాన్ని కళ్లకు కట్టిందా? ఈ చిత్రం ఎలా ఉందంటే…

రామాయణం మొత్తాన్ని తీసుకోకుండా అరణ్య కాండ, యుద్ధకాండలను మాత్రమే తీసుకుని మంచిపని చేశారు దర్శకుడు ఓంరౌత్. రామాయణం మొత్తాన్ని చిత్రీకరిస్తే గతంలో సినిమాలుగా వచ్చిన రామాయణాలకు ఈ చిత్రానికి పెద్ద తేడా ఉండేది కాదు. కేవలం గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం అన్నట్లు ఉండేది. శ్రీరాముడు వనవాసానికి సిద్దమైనప్పుడు మొదలవుతుంది ఈ చిత్రకధ. శ్రీరామునిగా ప్రభాస్ చాలా చక్కగా నటించారు. ప్రశాంతమైన ముఖ కవళికలతో, సాత్వికతతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే సీతాపహరణం, ఎడబాటు వంటి సంఘటనలలో దర్శకుడు ప్రభాస్ నటనకు పెద్ద ఆస్కారం ఇవ్వలేనట్లు తెలుస్తోంది. కేవలం సేతు నిర్మాణం సమయంలో వానర సైన్యాన్ని ఉత్తేజపరచడం, యుద్ధానికి వారిని ప్రోత్సహించిన సందర్భాలలో మాత్రమే హీరోయిజాన్ని వాడుకున్నారు.

రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా సీతారాముల వియోగం, శ్రీరాముని శోకం, సీతమ్మ అశోక వనంలో శోకించడం వంటి ఘట్టాలలో భావోద్వేగాలు ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేది. కృతిసనన్ సీతగా అందంగా, హుందాగా కనిపించింది. కానీ ఆమె నటనకు ఎక్కువ ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది. లంకేశ్వరునిగా సైఫ్ అలీఖాన్ కూడా బాగానే నటించారు. అయితే ఆయన ఆహార్యం కాస్త మోడ్రన్‌గా కనిపిస్తోంది. ఇక లక్ష్మణునిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం విజువల్ వండర్‌గా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీతం కూడా చాలా బాగుంది. జైశ్రీరామ్, శివోహం, హుప్ప హుయ్య , ప్రియమిథునం పాటలు, వాటి చిత్రీకరణ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించాయి. సీతారాముల మధ్య ప్రేమ, భావోద్వేగాలు కూడా చూపించి ఉంటే ఈ చిత్రం మరో బాహుబలి స్థాయిలో ఉండేదేమో అనిపిస్తుంది.

