నాచగిరి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతతో పూజలు చేసిన భక్తులు
గజ్వేల్: ఓ వైపు కార్తీక వ్రతాలు, మరోవైపు నిజాభిషేకాలు, కళ్యాణాలతో ప్రసిద్ధ నాచగిరి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతలు వెల్లివిరిశాయి. కార్తీకమాసం చివరి ఆదివారం సెలవురోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఇరుగు పొరుగు జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వ్రతమండపం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోగా, ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. భక్తులు ఉదయమే గుడికి చేరుకుని హరిద్రలో పుణ్యస్నానాల అనంతరం గర్భగుడిలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మరోవైపు దంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వారి వ్రతం చేసుకున్నారు. మరోవైపు సత్యనారాయణ స్వామి వారి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సుధాకర్ గౌడ్ తదితర సిబ్బంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.