వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ధర్మగుండం భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాజన్నను దాదాపు 25 వేల మంది దర్శించుకున్నారు. ఆలయ పార్కింగ్ స్థలం, పరిసరాల రోడ్లు భక్తులు, వారి వాహనాలతో సందడిగా మారాయి. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు.

