కొత్త సంవత్సరం ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నూతన సంవత్సరం సందర్బంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తమకు, తమ కుటుంబాలకు మంచి జరగాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాలలో ఆలయాలకు భక్తులు క్యూలు కట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీశైలం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలు తెలంగాణలోని యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర వంటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.. తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తులు మొక్కులు తీర్చుకుని విశేష పూజలు నిర్వహించారు. వేముల వాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు తీర్చుకున్నారు.

