National

దేవర హిట్టా..? ఫట్టా..? (మూవీ రివ్యూ)

దేవర.. కొన్ని రోజులుగా టాలీవుడ్ మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందా? అని ఫ్యాన్స్ తో పాటుగా, నార్మల్ ఆడియెన్స్ సైతం ఆత్రుతగా ఎదురు చూశారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్ల లోకి వచ్చింది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తుండడం, అందాలతార జాన్వికపూర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దీనితో టిక్కెట్ రేటు రెండితలు పెరిగినా అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ సినిమా ఎలా ఉందో.. ఓ సారి చూద్దాం.

స్టోరీ : ఏపీ తమిళ నాడు బోర్డర్ లో రత్నగిరి అనే ప్రాంతం. అక్కడ దేవర (ఎన్టీఆర్) రాయప్ప (శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) వారంతా సముద్రంలో వచ్చే సరుకుని దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ.., తాము బయటకి తీసుకొస్తున్న సరుకు కారణంగా బయట చాలా దారుణాలు జరుగుతున్నాయని తెలుసుకున్న దేవర.. ఇకపై సముద్రంలో దొంగతనం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. దీనిని భైరాతో పాటు మరికొందరు వ్యతిరేకిస్తారు. దీంతో.. దేవర తన వారిపైనే యుద్ధానికి దిగుతాడు. దెబ్బకు వాళ్ళు మళ్లీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. కానీ.., భైరా మాత్రం దేవరని చంపి.. చెడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశ పడతాడు. దీంతో.. దేవర ఓ కీలక నిర్ణయం తీసుకొని.. సముద్రంలోకి దొంగతనం కోసం ఎవరు వచ్చినా తెగ నరుకుతూ ఉంటాడు. అలా ఏళ్ళు గడిచిపోగా.. దేవర కొడుకు వరా (ఎన్టీఆర్) భయస్తుడిగా మారతాడు? అతడు దైర్యవంతుడిగా మారితే.. పెళ్లి చేసుకునేందుకు తంగం(జాన్వీ కపూర్) ఎదురుచూస్తూ ఉంటుంది. మరి.. దేవర కొడుకు భయస్తుడిగా ఎలా మారాడు? అసలు దేవర ఏమయ్యాడు? ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే దేవర మూవీ.

ఎలా ఉందంటే..
కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్, సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూశాడు కొరటాల. ప్రతీ మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్ నే సినిమా అంతా తీశాడు కొరటాల. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్ గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ గా తీసికెళ్లాడు దర్శకుడు కొరటాల. ఇంటర్వెల్ వరకు స్లోగా నెరేషన్ ఉన్నా.. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్టాఫ్ లో దేవర కథ చెప్పిన శివ.. సెకండాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్సులు.. మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్సులు చాలా బాగున్నాయి. సెకండాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. జాన్వీ కారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. తారక్, జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ కు తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర.. అసలెందుకు అలా ఉండాల్సి వచ్చింది.. దేవర రక్తం అయినా కూడా ఎందుకు అంత భయస్తుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశ్యంతోనే తీశాడు కొరటాల. అందుకే అక్కడక్కడా బాగా స్లో అనిపిస్తుంది. కానీ అభిమానులకు కావాల్సింది అయితే ఫుల్లుగానే ఇచ్చాడు కొరటాల. ముఖ్యంగా తారక్ కారెక్టరైజేషన్ బాగుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే మాత్రం కచ్చితంగా దేవర రేంజ్ మారిపోయి ఉండేది. క్లైమాక్స్ మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల.

నటీనటులు ఎలా చేశారంటే..
ఎన్టీఆర్ : దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్రలో డైలాగ్, యాక్షన్ ఫైట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి.
సైఫ్ అలీఖాన్: భైర పాత్రలో సైఫ్ అలీఖాన్ కూడా తన స్టైల్, నటనతో అలరించాడు. దేవర, బైరా మధ్య సై అంటే సై అనేలా సీన్లు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి.
జాన్వీకపూర్: తంగం పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. పొంగాలి, ఉప్పొంగి పోవాలి అంటూ సందడి చేస్తుంది కానీ, ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చుట్ట మల్లే… పాటతో తన అందాన్ని ఆరబోసింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ, శ్రుతి తదితరులు తమ తమ నటనతో అలరించారు.

బలాలు :

  • ఎన్టీఆర్ నటన
  • ఫస్టాఫ్ , దేవర దునియా
  • సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

బలహీనతలు

  • సెకండాఫ్ సాగదీత

చివరిగా : ఎన్టీఆర్ దేవర.. మాస్, యాక్షన్ మేళా

మనసర్కార్ రేటింగ్ : 3/5