Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderInternational

దేశంలో చమురు నిల్వలున్నా..వెనెజువెలా పై అమెరికా తహతహ ?

ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా అత్యధికంగా ముడి చమురును ఉత్పత్తి చేస్తున్న దేశం అమెరికానే. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 2025లో అమెరికా రోజుకు సగటున 13.4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసి విక్రయించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచూ చమురు గురించి మాట్లాడుతుంటారు. అయితే ఆయన ప్రసంగాల్లో వినిపించే చమురు చర్చలు కేవలం ‘అమెరికన్ ఆయిల్’ వరకే పరిమితం కావు. భారీ స్థాయిలో దేశీయంగా చమురు ఉత్పత్తి చేస్తున్నా, ఇతర దేశాల చమురుపై ఎందుకు అమెరికా దృష్టి పెట్టుతోంది? చమురు నిల్వలు ఉన్నా కూడా ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది? ఇదే అసలు ప్రశ్న.
అమెరికా తన దేశంలో ఉత్పత్తి అయ్యే చమురుతో పూర్తిగా మనుగడ సాగించలేకపోతోందా? చమురు వ్యాపారానికి, వెనెజువెలా మధ్య ఉన్న సంబంధం ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానం ముడి చమురు రకాలలో దాగి ఉంది.

భూమి నుంచి వెలికితీసే ముడి చమురును (క్రూడ్ ఆయిల్) దాని సాంద్రత, సల్ఫర్ పరిమాణం, ప్రవాహ సామర్థ్యం ఆధారంగా వేర్వేరు గ్రేడ్లుగా వర్గీకరిస్తారు. స్థూలంగా చెప్పాలంటే ముడి చమురు రెండు ప్రధాన రకాలు. ఒకటి తేలికపాటి ముడి చమురు (లైట్ క్రూడ్ ఆయిల్). రెండోది భారీ ముడి చమురు (హెవీ క్రూడ్ ఆయిల్).
‘‘ముడి చమురులో దాదాపు 160కి పైగా రకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు వాటికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపకల్పన చేయబడ్డాయి’’ అని ఇంధన విశ్లేషకుడు గౌరవ్ శర్మ తెలిపారు. భారీగా, గాఢంగా ఉండే ముడి చమురుతో పోలిస్తే తేలికపాటి ముడి చమురును శుద్ధి చేయడం చాలా సులభం. లైట్ క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్కువగా పెట్రోలు, జెట్ ఫ్యూయల్ వంటి అధిక విలువైన ఇంధనాలు లభిస్తాయి. మరోవైపు హెవీ క్రూడ్ ఆయిల్‌ను ఓడలకు ఇంధనం, రోడ్డు నిర్మాణ సామగ్రి, ఇతర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు.

భారీ ముడి చమురుతో పోలిస్తే తేలికపాటి ముడి చమురు విలువ ఎక్కువ. అందుకే దాని ధర కూడా అధికమే. అమెరికా సందర్భంలో ఇదే కీలక అంశం. 2025లో అమెరికా రోజుకు సుమారు 1 కోటి 34 లక్షల బ్యారెళ్ల ముడి చమురును విక్రయించింది. అదే సమయంలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇక్కడే సందేహం మొదలవుతుంది. తాము ఉత్పత్తి చేస్తున్న చమురును తమ అవసరాలకు ఎందుకు వినియోగించుకోవడం లేదు?

అమెరికాలో లభిస్తున్న ముడి చమురు రకం, అక్కడ ఉన్న రిఫైనరీల సామర్థ్యం మధ్య ఉన్న తేడాలో ఉంది. అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ ప్రకారం అమెరికాలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 80 శాతం తేలికపాటి చమురే. అమెరికాలోని చాలా రిఫైనరీలు గత శతాబ్దంలో భారీ ముడి చమురును శుద్ధి చేసేలా నిర్మించబడ్డాయి.
మరోవైపు, 20వ శతాబ్దం పొడవునా అమెరికాకు సరఫరా అయిన చమురు ఎక్కువగా లాటిన్ అమెరికా, కెనడా నుంచి వచ్చిన హెవీ క్రూడ్ ఆయిల్. ఆ తర్వాత 2000ల ప్రారంభంలో పరిస్థితి మారింది. సాంకేతిక అభివృద్ధితో షేల్ రాళ్ల నుంచి పెద్ద మొత్తంలో లైట్ క్రూడ్ ఆయిల్ వెలికితీయడం సాధ్యమైంది. ఫలితంగా అమెరికా ఉత్పత్తి చేస్తున్న చమురు రకం, అక్కడి రిఫైనరీలు శుద్ధి చేయగల చమురు రకం ఒకదానికొకటి సరిపోవడం లేదు.

‘‘ఒకసారి రిఫైనరీ నిర్మించాక దాన్ని పూర్తిగా మార్చడం చాలా కష్టం. దీనికి లక్షల నుంచి కోట్ల డాలర్ల పెట్టుబడి అవసరం. ఆర్థికంగా అది లాభదాయకం కాదు’’ అని గౌరవ్ శర్మ చెప్పారు. అందుకే అమెరికా తన లైట్ క్రూడ్ ఆయిల్‌ను ఎక్కువ ధరకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి, తక్కువ ధరకు హెవీ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇది పూర్తిగా ఆర్థిక లెక్కలపై ఆధారపడిన నిర్ణయం.

ప్రపంచంలో అత్యధిక హెవీ క్రూడ్ ఆయిల్ నిల్వలు వెనెజువెలా , సౌదీ అరేబియా, ఇరాన్, కెనడా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, రష్యా, అమెరికా, లిబియాలలో ఉన్నాయి. వీటిలో వెనెజువెలా, ఇరాన్, రష్యాలు ప్రస్తుతం అమెరికా ఆంక్షల కింద ఉన్నాయి. అయినప్పటికీ వెనెజువెలా నుంచి కొంత చమురు అమెరికాకు చేరుతూనే ఉంది.
దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. వెనెజువెలా లో చమురు క్షేత్రాలు కనుగొనబడిన తర్వాత అక్కడి చమురు పరిశ్రమ నిర్మాణంలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. 20వ శతాబ్దంలో ఎక్కువ భాగం అమెరికా వెనెజువెలా నుంచే భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంది. ‘‘ఇతర లాటిన్ అమెరికా దేశాల మాదిరిగా కాకుండా, వెనెజ్వెలా 1976లో చమురు జాతీయీకరణ చేసినప్పటికీ అమెరికాతో సంబంధాలను కొనసాగించింది’’ అని నవర్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కార్మెన్ బీట్రిజ్ ఫెర్నాండెజ్ తెలిపారు.

కానీ 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. చమురు పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణను ఆయన మరింత బలోపేతం చేశారు. ‘‘విదేశీ చమురు కంపెనీలపై కఠినమైన షరతులు విధించడం అమెరికా ప్రభుత్వానికి నచ్చలేదు’’ అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ గ్రేస్ లివింగ్‌స్టోన్ చెప్పారు. చావెజ్ మరణానంతరం నికోలస్ మదురో కూడా అదే విధానాలను కొనసాగించారు.

2019లో వరల్డ్ బ్యాంక్ ట్రిబ్యునల్ అమెరికన్ చమురు కంపెనీలకు పరిహారం చెల్లించాలని వెనెజ్వెలాను ఆదేశించింది. అది జరగకపోవడంతో వివాదాలు మరింత ముదిరాయి. 2025 చివర్లో అమెరికా సైన్యం వెనెజువెలా చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం, ఓడరేవులను దిగ్బంధించడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది.
వెనెజువెలా లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు అక్కడ ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువే ఎగుమతి అవుతోంది. ఆంక్షలు, నిధుల కొరత, దుర్వ్యవస్థాపన ఇందుకు కారణాలు. ‘‘సరైన స్థాయిలో చమురు సరఫరా పునరుద్ధరించడానికి కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది’’ అని గౌరవ్ శర్మ తెలిపారు.

వాతావరణ మార్పులపై ఆందోళనలు పెరుగుతున్నా, ప్రపంచ వ్యవస్థలో చమురు పాత్ర ఇప్పటికీ కీలకంగానే ఉంది. ‘‘చమురు పరిశ్రమ అనేక దేశాలకు అపారమైన సంపదను అందించింది. ఇది మల్టీ ట్రిలియన్ డాలర్ల పరిశ్రమ. రాత్రికి రాత్రే దేశాల భవితవ్యాన్ని మార్చగల శక్తి దీనికి ఉంది’’ అని గౌరవ్ శర్మ వ్యాఖ్యానించారు.