జగన్‌పై డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయినప్పటికీ రూల్స్ తెలియకుండా వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగం 190(4)లో చాలా స్పష్టంగా ఉందని, ఎవరైనా లీవ్ ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరు కాకపోతే వారి శాసనసభ లేదా పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుందని తెలిపారు. ఈ నిబంధన జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ రూల్స్ నెట్‌లో అందుబాటులో ఉంటాయని, వాటిని చూసుకోవాలని ఆయన హితవు పలికారు. వైసీపీ అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ రూల్స్ పరిశీలిస్తే ఎవరు ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఇచ్చే సమయం ఆయా పార్టీల బలం (స్ట్రెంత్) ఆధారంగా నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.క్వశ్చన్ అవర్ విషయానికొస్తే, ప్రతీ రోజూ రెండు ప్రశ్నలు వైసీపీ సభ్యులకు వస్తున్నాయని గుర్తు చేశారు. అయితే, వైసీపీ సభ్యులు ఎవరూ సభలో ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు.గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో ఏపి అసెంబ్లీ 68–69 రోజులు మించి ఎందుకు జరగలేదని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో వైసీపీకి నైతిక ధార్మిక హక్కు లేదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.