Home Page SliderTelangana

తెలంగాణకు డెంగ్యూ ఫీవర్.. జర జాగ్రత్త !

తెలంగాణలో డెంగ్యూ జ్వరం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలాగే అక్కడక్కడ మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,372 మంది డెంగ్యూ, 152 చికున్ గున్యా, 191 మలేరియా కేసులు నమోదయ్యాయని వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 81,932 నమూనాలను పరీక్షించగా.. అందులో 6.5 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 1,852 మందికి డెంగ్యూ కేసులు ఉన్నాయి. సెప్టెంబరు నెలలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ లోని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు డెంగ్యూ బాధిత చిన్నారులతో నిండిపోయాయి. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు. పిల్లలకు జ్వరం వస్తే ముందుగా డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, నెల రోజుల్లో 4 కోట్ల 40 లక్ష్లల మందిని పరీక్షించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. ఇందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు తెలిపారు.